Member-only story
అస్తిత్వం
స్వీడన్ ముఖ్యపట్నం అయిన స్టాక్ హెూమ్ 14 ద్వీపాల నగరం. వాటిలో గమ్లస్టేషన్ ఒక పురాతనమైన ద్వీపం. స్టోర్కిరస్ కారోనేషన్ చర్చికి తూర్పువైపు వున్న సన్నటి వీధిలో ఒక ఎర్ర రంగు ఇల్లు ఉంది. అది సాధారణ స్వీడిష్ మధ్య తరగతి జీవనానికి ప్రతీక. ఆ ఇంటి పెద్ద పెద్ద కిటికీల నుండి శీతాకాలపు ఎండ గదిలో పడుతోంది. ఆ వెలుగుకు గదిలో ఉన్న ఆకుపచ్చని తివాచీ మెరుస్తోంది. ఆ వెలుగులో ఓ చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఆ కుర్రాడికి ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. తాను చిన్నవాడినని, తాను పెద్దవాడిని అవుతానని తెలుసు. కాని పుట్టుక గురించి కానీ, చావు గురించి కానీ తెలియదు. తనకి నాలుగు సంవత్సరాలని, త్వరలో ఐదు సంవత్సరాలు వస్తాయని తెలుసు. కానీ ‘సంవత్సరం’ అంటే ఏమిటో తెలియదు. ఆ కుర్రాడి కాలంలో మూడు రోజులు ఉన్నాయి- నిన్న, నేడు, రేపు.
“నాన్నా” ఆడుతూ పాడుతూ మధ్యలో పిలిచాడు. తండ్రి అప్పుడే ఉదయపు ఫలహారం తిని, చుట్ట ముట్టించాడు. ఆ రోజు అతనికి అది మొదటి చుట్ట. అతను కాలాన్ని కాల్చిన చుట్టలతో కొలుస్తాడు.
“నిన్న రాత్రి బోల్డు కలలొచ్చాయి నాకు. అన్ని కలల్లో ఈ గది, ఈ గదిలో కుర్చీలు, ఆకుపచ్చని తివాచీ, అద్దాలు, కిటికీలు, గోడ గడియారం, గది తలుపులు, అలమార…” అలా అంటున్నవాడు మాటలాపి, కిటికీ దగ్గరికి వెళ్ళి పిల్లి మొగ్గలు వెయ్యడం మొదలుపెట్టాడు ఆనందంగా. ఆడుకోడానికి హాయిగా అనిపించే ఆ జాగా ఆ కుర్రాడికి చాలా ఇష్టం.
“ఆహా…” అన్నాడు తండ్రి, తన వార్తాపత్రిక అంచునుండి కులాసాగా కొడుకువైపు ఆప్యాయంగా ఒకచూపు చూసి. ఆ కుర్రాడు తండ్రి వైపు తిరిగి హాయిగా నవ్వాడు.
నవ్వు ఇంకా సహజమైన ఆనందాన్ని మాత్రమే తెలిపే వయసు ఆ కుర్రాడిది. క్రిందటి రోజు కిటికీ దగ్గర నిలబడి చంద్రుణ్ణి చూసి ఇలాగే నవ్వాడు. చంద్రుడు వింతగా ఉన్నాడని కాదు, వెలుగు విరజిమ్మే చంద్రబింబం ఆనందాన్ని కలిగించడం వల్ల.