Member-only story
ఫెయిలయిన పిల్లలు పాస్ అయిన టీచరు
“ఐదో క్లాసు పిల్లలందరూ ఫెయిల్ అయ్యారంట!”
“నిజమా?!” ఊరు ఊరంతా ఇదేమాట
విషాదంకాని ఈవిషాదవార్త అందరికీ తెలిసేవేళకి సూర్యుడు పడమటి దిక్కున అంతర్ధాన మవుతున్నాడు. ఆశ్చర్యపడేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్ష తప్పిన పిల్లల తల్లిదండ్రుల ఆగ్రహం రెట్టింపవుతోంది. అది గ్రామం ఊరి పెద్దల వద్ద మొదలై…. ఇంకా పిల్లలు పుట్టని కొత్త జంటలకూ పాకిపోయింది. పిల్లలంతా ఐదోక్లాస్ తప్పడం ఊరికి జరిగిన అవమానమేనని అందరి బుర్రల్లో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే ఐదోక్లాస్ దాకా రావడమంటే ఈ ఊరిలో గొప్పే వారికది పీజీతో సమానం. ఐదుపాసై ఊరిలో ఆరోక్లాస్ లో చేరాలంటే విదేశాల్లో చదువుకునేందుకు వెళ్ళినట్టే. ఐదుపాసై హీరోలు కావాల్సిన పిల్లలు, జీరోలై మిగలడం ఊరు జీర్ణించుకోలేక పోతోంది.
ఎందుకిలా జరిగిందో బేరీజు వేసుకోలేక ఫిఫ్ట్ క్లాస్ టీచర్ ఒకపక్క మధనపడి పోతోంది. పిల్లలంతా బాగా చదివేవారే ఒక్కరు కూడా పాస్ అవ్వలేదంటే… ఏం జరిగి ఉంటుందో అర్ధంకాక ఓ నిర్ణయానికి రాలేక అయోమయంలో ఖాళీ కడుపుతో నడుంవాల్చింది. మరోపక్క ఎప్పుడు తెల్లారుతుందా? అని గ్రామస్థులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. వాటి వెలుగు, ఇంటి చూరు దాటకపోయినా, కంటిమీద కునుకు దూరం చేస్తోంది. ఇవేవీ పట్టని వీధికుక్కలు అప్పుడప్పుడు. తమ ఉనికిని చాటుకుంటున్నాయి. తుఫాను ముందు ప్రశాంతతలా ఆ గ్రామం నిద్ర నటిస్తోంది.
అది వెనకబడిన జిల్లాల్లో ఒక చిన్న ఊరు. పాఠశాల ఉంది. అందులో ఆ ఊరిలోని మాల మాదిగల పిల్లలే ఎక్కువమంది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మవంటి కులాలవారు ఎవ్వరూ ఆ ఊరిలో మిగలలేదు. మిగిలిన కాపు, నాయుడు వంటి కులాల వాళ్ళు తమ పిల్లల్ని ఈ బడికి పంపరు అగ్రవర్ణాలవారు తమని అణచి వేస్తున్నారని ఆగ్రహిస్తారు కాని, తమ పిల్లలు కింది కులాల వారితో కలిసి చదువుకునే కొద్దిపాటి సమానత్వాన్ని…